కాంగ్రెస్ నిర్ణయంతో ఇరాన్‌తో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు

  • అటామిక్ ఎనర్జీ ఏజెన్సీలో ఇరాన్‌కు వ్యతిరేకంగా నాటి యూపీఏ ఓటు వేసిందన్న రామచందర్ రావు
  • యూపీఏ ఆరోజు తీసుకున్న నిర్ణయం ఇరుదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసిందని ఆగ్రహం
  • గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టీకరణ
  • ఇంధనం, గ్యాస్ నిల్వలు మన వద్ద ఉన్నాయని వెల్లడి
2005లో యూపీఏ ప్రభుత్వం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీలో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిందని, దీనితో 2012లో మనకు ఇరాన్ ఆయిల్ సరఫరా నిలిపివేసింది తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. యూపీఏ ప్రభుత్వం ఆరోజు తీసుకున్న నిర్ణయం భారత్, ఇరాన్ సంబంధాలను దెబ్బతీసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి అనుకూలంగా మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ ప్రజల్లో భయాందోళనలు కలిగించే తప్పుడు ప్రచారం చేయవద్దని హితవు పలికారు.

గతంలో ఇరాన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన కాంగ్రెస్, ఇప్పుడు ఇరాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నట్లు నటిస్తూ, భారతదేశంలో చమురు కొరత ఉందని తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. యూపీఏ హయాంలో కేవలం 16 దేశాల నుంచి మాత్రమే చమురు దిగుమతి చేసుకునే వారమని, నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక ఆ సంఖ్య 40 దేశాలకు పెరిగిందని అన్నారు. గ్యాస్ సిలిండర్ ధరలపై ఎటువంటి ప్రభావం ఉండదని ఆయన హామీ ఇచ్చారు.

దేశంలో తగినంత ఇంధనం, గ్యాస్ స్టాక్ ఉందని రామచందర్ రావు తెలిపారు. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఆందోళన కలిగించే అబద్ధపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. చైనాతో రహస్య ఒప్పందాలు చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు.

తెలంగాణలో ఖజానా ఖాళీ అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం కథలు చెబుతున్నారని, కానీ అదే ప్రజల ధనంతో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. కేరళలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని తెలిపారు. తెలంగాణలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు.

Ramachander Rao
BJP Telangana
Iran
India Iran relations
Congress party
UPA government

More Telugu News